మహిళలకు ఏడాదికి రెండు చీరలు..!

తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం హైదరాబాద్

మహిళలకు ఏడాదికి రెండు చీరలు..!
– రూ. 1000 కోట్ల ఖర్చుతో అమలు
– మహిళ సమాఖ్యలకు పెట్రోల్ బంకులు
–  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
నారాయణ పేట్, దర్శిని ప్రతినిధి : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అంటూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ముందుకు సాగేలా దృష్టి సారిస్తన్నారు. ఈ మేరకు మహిళ సమాఖ్యల ద్వారా పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఏడాదికి రూ. 1000 కోట్ల ఖర్చుతో మహిళా సమాఖ్య సభ్యులకు రెండు చీరలు అందజేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ప్రజా పాలనలో మహిళలకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వారు ఆత్మగౌరవంతో బతికినప్పుడే ఆ కుటుంబాలు నిలబడుతాయి. మహిళా సంఘాలకు ఇప్పటికే అనేక పనులు అప్పగించాం. అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

ఇందిరా మహిళా శక్తిలో 67 లక్ష్లల మంది ఉన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తాం. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామని, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించామని అన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదు. 1000 కోట్లతో మహిళా సమాఖ్య సభ్యులకు చీరలు ఇస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఏడాదిలో రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. రూరల్, అర్బన్ అనే తేడా లేదు తెలంగాణలో మహిళలంతా ఒక్కటే అని అన్నారు. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలి అని రేవంత్ సూచించారు. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తున్నామో బడి కూడా అలాగే నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, లోక్‌సభ సభ్యులు డీకే అరుణ గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పోలేపల్లికి రేణుకా ఎల్లమ్మకు సీఎం మొక్కు..!