అందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలి
– తాండూరు మున్సిపల్లో ఫుడ్ మేళా
– సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పరిశీలించిన బీజేపీ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిరు వ్యాపారులందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాలో ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, చిరు వ్యాపారులు పాల్గొని ప్రదర్శనలు ఇచ్చారు. వంటకాలు, చిరు ధాన్యాలు తయారి, ఇతర విక్రయాలపై ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఈ ఫుడ్ మేళా ప్రదర్శనను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. మహిళలు, చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు విభిన్న రంగాల్లో చేయూత అందిస్తుందని అన్నారు. అవకాశాలను అందరు అందిపుచుకుని స్వయం ఉపాధితో ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, నాయకులు బాతుల వెంకటయ్య, కావలి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

పరిశీలించిన బీజేపీ నాయకులు
మరోవైపు పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్, అంతారం లలిత తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడి చిరు వ్యాపారుల కోసం ఈ స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. స్ట్రీట్ వెండర్ పథకం ద్వారా తాండూరులోని 4623 మందికి లబ్ది చేకూరిందని అన్నారు. ఎలాంటి షూరిటీ లేకుండా 10వేల నుంచి 50వేల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోందని అన్నారు. ఈ పథకంలో చిరు వ్యాపారులందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, జిల్లా ప్రతినిధి రవికుమార్. తాండూరు మెప్మా టీఎంసీ రాజేంద్రప్రసాద్, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వీరశైవ సమాజానికి అండగా ఉంటాం