గులాబీ విన్నింగ్స్ సూపర్..!
– పైలెట్ ఆధ్వర్యంలో విజయాలు అభినందనీయం
– మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అభినందించిన కేటీఆర్
– గెలిచిన సర్పంచులు కాంగ్రెస్‌కు భయపడొద్దు
– బీఆర్ఎస్ భవన్‌లో పాలనపై దిశా నిర్దేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట తాండూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ మద్దతుదారుల విజయాలు అభినందనీయమని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇటీవల జరిగిన పంచాతీయ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టి మద్దతుతో తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో గెలిచిన సర్పంచులు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌తో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు సమావేశం అయ్యారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 67 మంది సర్పంచులు గెలుపొందడం, ఉప సర్పంచులుగా నియామకం కావడం అభినందనీయమన్నారు. మద్దతుదారులను గెలిపించుకోవడంతో రోహిత్ రెడ్డి కృషిని కూడా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రెండున్నరేళ్లే ఉంటుందని.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

గ్రామాల అభివృద్ధి విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులను ఎవ్వరు ఆపలేరని, అందరు ధైర్యంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మీడియా ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ(కోటబాస్పల్లి కొత్త సర్పంచ్) స్వరూప వెంకట్రామ్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

