అయ్యో.. రంగారావు సారూ..!
– ఎన్నికల్లో ఆయన ఓటు తిరస్కరణ
– 2గంటల పాటు టైం వేస్ట్ చేసిన అధికారులు
– ఓటు వేయకుండానే వెనుదిరిగిన విద్యావేత్త
– తాండూరు పట్టణంలో చర్చనీయాంశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో విశ్రాంత ఉద్యోగి, తెలంగాణ ఉద్యమ నేత, విద్యావేత్త రంగారావుకు చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఓటును అధికారులు తిరస్కరించారు.

చాలెంజ్ ఓటు అప్పీల్ కు కూడా అవకాశం దక్కలేదు. దీంతో ఆయన ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బుధవారం తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. తాండూరులోని 28వ వార్డులో విద్యావేత్త రంగారావు, మాజీ కౌన్సిలర్ రిటైర్డ్ ఉద్యోగి విజయదేవిలకు ఓటు హక్కు ఉంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేటాంచిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వేసేందుకు వచ్చారు. విజయాదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే రంగారావుకు సంబంధించిన కార్డులో పేరు తప్పుగా ఉందని అధికారులు ఓటు వేసేందుకు నిరాకరించారు. ఓటరు కార్డుకు బదులు ఇతర కార్డులు చూపించినా అధికారులు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వలేదు. పోలింగ్ సమయం ముగిసే వరకు కేంద్రం వద్దనే ఉంచుకుని ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రంగారావు సారూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై విజయాదేవి మాట్లాడుతూ ఎన్నికల అధికారుల తీరు సరైంది కాదని విమర్శించారు. అన్ని ఆధారాలు చూపినా ఓటు వేసేందుకు అంగీకరించలేదన్నారు. చాలెంజ్ ఓటుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాంశమైంది.

ఇదికూడా చదవండి..

