ప్రశాంతంగా పురపోరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రశాంతంగా పురపోరు..!
– ఓటెత్తిన యువత, నేతలు, ప్రజలు
– తాండూరులో 67.54 శాతం నమోదు
– అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
– సర్ది చెప్పి.. సద్దుమణిగించిన పోలీసులు
– ఎంతమంది ఓటు వేశారంటే..? 

తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం తాండూరు పట్టణంలోని 36 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ సారి వెబ్ క్యాస్టింగ్ నిర్వహించారు.

పట్టణంలోని 117 పోలింగ్ కేంద్రాల్లో 117 పీఓలు, 117 ఏపీఓలు, మరో ముగ్గురు సిబ్బంది 585 మందితో పాటు 10శాతం రిజర్వు సిబ్బందితో పోలింగ్ జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో జరిగిన పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అబ్జర్వర్లు, డీఆర్వో మంగిలాల, వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ బీఆర్ నాయక్ తదితరులు పర్యవేక్షించారు.

పట్టణంలో మొత్తం 77వేల 29 మంది ఓటర్లు ఉండగా ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సహాం చూపారు. ఈ సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత మొదటిసారి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారితో పాటు మహిళలు, పెద్దలు, వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు పోలింగ్‌ శాతంను ప్రతి రెండు గంటలకు ఒకసారి విడుదల చేశారు. ఉదయం పోలింగ్ మందకోడిగా కొనసాగింది. క్రమంగా మద్యాహ్నానికి పుంజుకుంది. సాయంత్రానికి వేగవంతం అయ్యింది. ఉదయం 10.39శాతం, మధ్యాహ్నం 3గంటలకు 58.39శాతం నమోదు కాగా సాయంత్రం పోలింగ్ ముగిసే సరికి 67.54శాతం నమోదయ్యింది. మొత్తం 77వేల 29 ఓటర్లలో 52వేల 25 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చెదురమదురు ఘటనలు
మరోవైపు తాండూరు పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పట్టణంలోని 36వ వార్డుకు సంబంధించి పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల మద్య వాగ్వివాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చెదరగొట్టారు. అదేవిధంగా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో, నెహ్రు గంజ్‌ వద్ద స్వల్ప వివాదాలు జరిగాయి.

అదేవిధంగా పట్టణంలోని 13వ వార్డులో కూడా వివాదం జరిగింది. పట్టణంలోని విజయవిద్యాలయ వద్ద 34, 23వ వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దొంగ ఓట్లు వేస్తున్నారనే దానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, ఆయా పార్టీల కౌన్సిలర్ల అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకుని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, సీఐలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడి సర్దిచెప్పారు. ఆందోళన కారులను కూడా అక్కడి నుంచి తరలించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కొన్ని చెదురుమదురు ఘటనలతో తప్పా మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

ఇదికూడా చదవండి…