విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పు..!
– విద్యార్థులకు యంగ్ ఇండియా కిట్లు గొప్ప నిర్ణయం
– రేవంత్ సర్కారు అందిస్తున్న సూపర్ గిఫ్ట్
– కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యా వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో విప్లవాత్మక మార్పు తీసుకవస్తుందని, యంగ్ ఇండియా ద్వారా కిట్లను అందిస్తూ విద్యార్థులకు సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతోందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు.

బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూళ్లు, గురుకులాల్లో చదివే 27.11 లక్షల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.

దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు గిఫ్ట్లు అందిస్తూ విప్లవాత్మక మార్పుకు నాంది పలికిందని అన్నారు. విద్యా కిట్ ద్వారా రెండు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూల్/కాలేజ్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్టేషనరీ, బెల్ట్, టై, ఐడెంటిటీ కార్డులు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా స్పోర్ట్స్ కిట్ ద్వారా ప్రతి విద్యార్థికి క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు స్పోర్ట్స్ కిట్, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్, క్యారమ్, చెస్ వంటి ఆట వస్తువులు, పిల్లలకు పీటీ డ్రెస్, స్పోర్ట్స్ షూస్ అందిస్తుందని తెలిపారు.

ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తారని తెలిపారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడల నిర్మాణ నానికి 2.56 లక్షలు నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు.


