సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యం
– అందరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– తాండూరులో ఘనంగా సైబర్ జాగృత దివాస్
– పాల్గొన్న చైర్ పర్సన్, నేతలు, అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సైబర్ నేరాల నియంత్రణే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ లక్ష్యమని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృత దివాస్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సురక్షా కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాలను తాండూరులో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హాజరయ్యారు.

తాండూరు పట్టణంలోని చౌరస్తా నుండి సెయింట్ మార్క్ స్కూల్ వరకు సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎస్పీ స్నేహా మెహ్రాతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, పలువురు నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సెయింట్ మార్క్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సైబర్ అవగాహన సమావేశంలో ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తంగా వ్యవహరించడం అత్యంత అవసరమని తెలిపారు.

సైబర్ నేరాలను నియంత్రించడంతో ప్రభుత్వం, పోలీసు శాఖ లక్ష్యమని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ పెట్టుబడి ఆఫర్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వచ్చే మోసాలను నమ్మవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదిచంచాలని, నేషనల్ సైబర్ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు, వైస్ ఛైర్మెన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


