తాండూరులో ఎండుగంజాయి స్వాధీనం..!
– బీహార్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
– 1.150 కిలోల గంజాయి స్వాధీనం, రిమాండ్‌కు తరలింపు
– వివరాలు వెల్లడించిన జిల్లా మద్యనిషేధ, ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎండుగంజాయి విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.150 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు జిల్లా మద్యనిషేధ మరియు ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన మహ్మద్ ముస్తకీమ్ తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలోని గోపన్‌పల్లి వద్ద ఉన్న తబ్రేజ్ స్టోన్ పాలిషింగ్ ఫ్యాక్టరీ సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం ఎక్సైజ్ అధికారులకు అందింది.

దీంతో తాండూరు ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎన్. రాణి నేతృత్వంలో ప్రత్యేక బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నిందితుడి వద్ద నుంచి 1.150 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా జిల్లా మద్యనిషేధ, ఆబ్కారీ అధికారి డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే తాండూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్, సెల్ : 8712658754కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది విక్రమ్, అలీం, పండరి, రాజేష్, రామారావు, రాములు, సతీశ్, జార్జ్ పాల్గొన్నారు.


