ఖతర్నాక్ కి’లేడీ’లు..!
– బంగారం కొనేందుకు వచ్చి చోరీ
– షాపులో షోకేజ్ తో సహా అపహరణ
– సీసీ కెమెరాల్లో దృశ్యాల రికార్డు
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంగారం కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి ఓ ఖతర్నాక్ కిలేడీలు ఆభరణాన్ని చోరీ చేశారు. షాపులో విక్రయించేందుకు ఉంచిన షోకేజ్ తో సహా బంగారు నెక్లెస్‌ను అపహరించి ఉడాయించారు.

ఈ ఘటన గాంధీ చౌక్ సమీపంలోని గంజిపల్లి సాయి జువెలరీ షాప్‌లో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటూ షాప్‌లోకి వచ్చారు.

నగలు చూపించాలని కోరుతూ యజమానిని మాటల్లో పెట్టారు. ఇదే సమయంలో వారి చాకచక్యాన్ని ఉపయోగించి 10 గ్రాముల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్లారు. పని పూర్తయ్యాక ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొద్దిసేపటికి నెక్లెస్ కనిపించకపోవడంతో యజమాని షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.


