రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
– నిర్మాణంలో బాధితులకు డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇళ్లు
– బ్రిడ్జి పూర్తి అయితే ట్రాఫిక్, గేటు కష్టాలు దూరం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో చేపడుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంగళవారం పాత తాండూరు లోని రైల్వే బ్రిడ్జి పనులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో బ్రిడ్జి నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు తదితర పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు. పాత తాండూరు ప్రజల అవసరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ దశలో ఇండ్లు కోల్పోయిన వారికి, ఆస్తి నష్టం కలిగిన వారికి డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్లతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు.

బ్రిడ్జి పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు, రైల్వే గేట్ వద్ద వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతాయని అన్నారు. బ్రిడ్జి పనుల పూర్తితో పాత తాండూరు ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు, ఆర్అండ్బీ, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు ఉన్నారు.


