విధుల్లో నిర్లక్ష్యం వద్దు..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

విధుల్లో నిర్లక్ష్యం వద్దు..!
– సమయపాలన తప్పనిసరి
– తాండూరు జిల్లా ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించరాదని వైద్య ఆరోగ్య శాఖ వికారాబాద్‌ జిల్లా అధికారి(డీఎంహెచ్‌వో) డా.కె. సుధాకర్ లాల్ సూచించారు.

శనివారం తాండూరులోని జిల్లా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని వయోజనుల సంరక్షణ ఫిజియోథెరపీ కేంద్రం, మెంటల్‌ హెల్త్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌, ఐసీటీసీ కేంద్రం, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ వార్డు, డెంటల్‌ ఓపీ కేర్‌ సెంటర్లను సందర్శించారు.

ఆయా కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆసుపత్రిని తరచుగా తనిఖీ చేస్తానని తెలిపారు.

త్వరలో తాండూరు జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్‌వో.. వైద్యులతో మాట్లాడి అక్కడ అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. స్కానింగ్‌ సెంటర్‌, ఎస్‌ఎన్‌సీయూ, పోషకాహార అనుబంధ కేంద్రాలను పరిశీలించారు. ఆయా విభాగాల్లో నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులతో సిబ్బంది సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సింగ్‌, సెక్యూరిటీ సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రవీంద్ర యాదవ్‌, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి