తాండూరుకు నీటి కటకట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరుకు నీటి కటకట..!
– మిషన్ భగీరథ రాకపోవడంతో ఇబ్బందులు
– తాగునీటికి శాశ్విత పరిష్కారం చూపించాలి
– అసెంబ్లీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కటకట వేధిస్తోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో తాండూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తాండూరు పట్టణంలో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. తాండూరు పట్టణానికి ప్రతిరోజూ రావాల్సిన 8 ఎంఎల్‌డీ మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే అసెంబ్లీలో తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, కొన్ని ప్రాంతాలకు మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రజలు ఆధారపడాల్సి వస్తోందన్నారు.

ముఖ్యంగా వేసవి పరిస్థితుల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉన్న తాండూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మనోహర్‌రెడ్డి కోరారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో ఉన్న లోపాలను వెంటనే సరిచేసి, పట్టణం, గ్రామీణ ప్రాంతాలకు సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.

తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..!