దోచుకోవడమే కాంగ్రెస్ కుట్ర..!
– పైసా వసూల్‌కే 22ఏ జీఓ
– మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం
– తాండూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే మాయ
– ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ఆక్రమ నిర్మాణాలు
– బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం
– తాండూరు ఆస్తులు, వనరులు తరలించకుండా ఉద్యమం
– మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పైసలు వసూలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ జీఓను తీసుకవచ్చిందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించారు.

గురువారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, స్థలాలపై దౌర్జన్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. తాజాగా డబ్బులను వసూలు చేసేందుకు 22ఏ జీఓను తీసుకవచ్చిందని, దీని ద్వారా పైసా వసూలు చేసేందుకు భారీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ డీఎన్‌ఏలో కమీషన్ల వసూళ్ల దందా దాగి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, మోడి, చంద్రబాబు నాయుడులకు బ్రోకర్‌లా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూలను నిషేధిత జాబితాలో ఉంచి ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌కు 1000 ఎకరాల భూమి ఉందని ఇన్నాళ్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 67 ఎకరాలు ఉందని చెప్పడంలో విషప్రచారం దాగిందని అన్నారు. దీంతోపాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కూడా లేనిపోని అబండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు ఎందుకు నోటీసు ఇవ్వలేదని, చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఓ న్యాయం, పేదలకు ఓ న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో, తాండూరు నియోజకవర్గంలో ప్రజా పాలనలో బుల్‌డోజర్ పాలన సాగిస్తున్నారని అన్నారు. ఏదేమైనా 22ఏ జీఓపై పేదలకు అన్యాయం జరగకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. అదేవిధంగా తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కోట్‌పల్లి మరమ్మత్తుల వెనుక తాండూరు కాగ్నా నీటిని కోడంగల్‌కు తరలించే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అధికారంను అడ్డం పెట్టుకుని 135,139, తదితర ప్రభుత్వ సర్వేనెంబర్లలో భూములు ఆక్రమణకు అండగా నిలిచారని ఆరోపించారు.

పోట్లీ మహరాజ్ దుకాణాల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న దగాపై పేగులు తేగేదాకా పోరాటం చేస్తామని, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాగ్నా నీరు, ఇసుక, మట్టి, దవాఖాన, ఇంటిగ్రేటేడ్ స్కూల్‌లు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, నాయకులు సంతోష్ గౌడ్, కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు.


