రాబోవు నిధులను జార విడవం..!
– 15,16వ ఫైనాన్స్ నిధులు రాకపోవడంపై విచారకరం
– గత పాలకవర్గం తీరుతోనే నిధులకు మొండిచెయ్యి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్‌కు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు అందకపోవడంపై మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

భవిష్యత్‌లో వచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడవకుండా అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడారు. గత పాలకవర్గం హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో లోపాలు ఉన్నట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందిందని తెలిపారు.

నిధుల వినియోగం సక్రమంగా జరగకపోవడంతో ప్రస్తుత విడతలో తాండూరు మున్సిపల్‌కు రావాల్సిన రూ. 3కోట్ల నిధులు మంజూరు కాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు 16వ ఆర్థిక సంఘం నిధులపైనా ప్రభావం పడే పరిస్థితి ఏర్పడటం బాధాకరమని అన్నారు. పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కీలకమని పేర్కొన్నారు. ఇకపై మున్సిపల్ పరిధిలో అందుబాటులో ఉన్న నిధులను నిబంధనల మేరకు ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

పట్టణ ప్రజలు తమ ఆస్తి, నీటి తదితర పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. తాండూరు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్‌రెడ్డి సహకారంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిధులు, ఇతర వనరులను సమర్థంగా వినియోగించుకుని పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని నీరజా బాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్ సల్మా ఫాతిమా తదితరులు ఉన్నారు.


