పోస్టాఫీస్ అకౌంట్లకు కొత్త రూల్స్..!
– సేవింగ్స్ ఖాతాల నిర్వహణపై మార్గదర్శకాలు
– రూ.500 కనీస నిల్వ లేకపోతే జరిగిదిదే..?
– ఖాతాదారులు జర జాగ్రత్తలు తెలుసుకోండి
దర్శిని ప్రతినిధి: పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతాలు కలిగిన ఖాతాదారులకు డాక్ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతా నిర్వహణ, బదిలీ, నగదు ఉపసంహరణ, మూసివేతకు సంబంధించిన నిబంధనల్లో పలు అంశాలను స్పష్టం చేసింది.

ఎస్బీ ఆర్డర్ నంబర్ 13/2026 ద్వారా నవంబర్ 17న పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ సీబీఎస్ మాన్యువల్–2026ను విడుదల చేసింది.
రూ.500 కనీస నిల్వ తప్పనిసరి: సాధారణ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.500 నిల్వ ఉంచాలి. లేకుంటే ఆర్థిక సంవత్సరం చివరి పనిదినాన రూ.50 ఖాతా నిర్వహణ రుసుము విధిస్తారు. ఈ మొత్తంలో 18 శాతం జీఎస్టీ కలిపి ఉంటుంది. రుసుము మినహాయించిన తర్వాత నిల్వ సున్నాకు చేరితే ఖాతా మూసివేస్తారు.

మూడేళ్లు లావాదేవీలు లేకుంటే : వరుసగా మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాలు నగదు జమ లేదా ఉపసంహరణ జరగని ఖాతాలను నిష్క్రియ ఖాతాలుగా పరిగణిస్తారు. ఖాతాలో జమయ్యే వడ్డీని లావాదేవీగా గుర్తించరు.
బదిలీకి రూ.100 ఛార్జీ: ఒక పోస్టాఫీస్ నుంచి మరో పోస్టాఫీస్‌కు సేవింగ్స్ ఖాతాను బదిలీ చేసుకోవాలంటే రూ.100 సర్వీస్ ఛార్జీతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఖాతాదారుడు మరణించినప్పుడు నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు నిర్దేశిత విధానంలో నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. నామినీ లేని సందర్భంలో రూ.5 లక్షల వరకు వారసత్వ ధ్రువీకరణ పత్రం లేకుండానే క్లెయిమ్ పరిష్కరించే అవకాశం ఉంది. అయితే అవసరమైన ఇతర పత్రాలు సమర్పించాలి.

టీడీఎస్ నిబంధనలు: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి దాటిన నగదు ఉపసంహరణపై ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి అదనపు మొత్తంపై 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రిటర్నులు దాఖలు చేయని వారికి రూ.20 లక్షలు దాటిన ఉపసంహరణపై 2 శాతం, రూ.కోటి దాటితే కోటి రూపాయలకు మించిన మొత్తంపై 5 శాతం టీడీఎస్ విధిస్తారు.
ఇక 2023 నవంబర్ 10 లేదా ఆ తర్వాత ప్రారంభించిన ఐదేళ్ల టైమ్ డిపాజిట్ ఖాతాలను ముందస్తుగా మూసివేయాలంటే నాలుగేళ్లు పూర్తవ్వాలి. కొత్త నిబంధనల నేపథ్యంలో ఖాతాదారులు కనీస నిల్వ, నామినీ వివరాలు, కేవైసీ సమాచారాన్ని పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.


