ఇళ్ల మద్య సెల్ టవర్ ఏర్పాటు..!
– అనుమతులపై అనుమానాలు
– పట్టించుకోని మున్సిపల్ అధికారులు
– విచారణ జరిపి నిలిపివేయాలి
– బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజల నివాసాల మధ్య సెల్ఫోన్ టవర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని వాల్మీకి నగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆ వార్డు బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ విమర్శించారు.

టవర్ ఏర్పాటుకు మున్సిపల్ అనుమతులు, నిర్మాణ పటిష్టతకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేడియేషన్ ప్రమాణాలు, ప్రజల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారో లేదో బహిర్గతం చేయాలని కోరారు.

మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి సంబంధిత శాఖల అధికారులతో స్థల పరిశీలన చేయించాలని కిరణ్ డిమాండ్ చేశారు. అనుమతులపై స్పష్టత వచ్చే వరకు టవర్ పనులకు అనుమతించకూడదని, విచారణలో నిబంధనల ఉల్లంఘన బయటపడితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల భద్రత కంటే ఎవరి ప్రయోజనాలూ ముఖ్యం కాదని, స్థానికుల ఆందోళనకు అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలని అంతారం కిరణ్ డిమాండ్ చేశారు.


