రైతుల పట్ల చిన్నచూపు తగదు..!
– న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
– బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
– దౌలాపూర్ రైతుల రిలే నిరాహార దీక్షకు బీసీ సంఘం మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు తమ హక్కుల కోసం, చట్టప్రకారం రావాల్సిన పరిహారం కోసం రోజుల తరబడి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం బాధాకరమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ అన్నారు.

కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మల్కయ్య నేతృత్వంలో కొనసాగుతున్న దౌలాపూర్ రైతుల రిలే నిరాహార దీక్షకు సోమవారం తాండూరు బీసీ సంఘం ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులకు చట్టప్రకారం అందాల్సిన పరిహారం ఇవ్వడంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

యాలాల మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి రైతులకు ఆశించిన సహకారం అందడం లేదని, అధికారులు బాధ్యతగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం సోమవారం ప్రజావాణిలో ఎంపీడీఓను కలిసి రైతుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. పరిహారాన్ని వెంటనే మంజూరు చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు న్యాయం జరిగే వరకు బీసీ సంఘం అండగా ఉంటుందని, వారి హక్కుల సాధనకు పూర్తి సహకారం అందిస్తామని రాజ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య, మహేందర్, రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, బీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జి బస్వరాజ్, జోసెఫ్, దుబాయ్ వెంకట్, ప్రవీణ్, చిన్నా, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


