అభివృద్ధిపై అడ్డగోలు మాటలు కట్టిపెట్టండి..!
– పదేళ్లలో ఏం చేయలేదని దుష్ప్రచారం చేయొద్దు
– మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గాంధీనగర్‌లో అభివృద్ధి జరగలేదంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు.

విమర్శలు చేసే ముందు వార్డులో గతంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. గతంలో కమేళా, స్లాటర్ హౌస్ పరిసరాల్లోని ఆక్రమణలు తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించామని తెలిపారు. అప్పటి మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశామని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి సహకారంతో హరితహారం కార్యక్రమం చేపట్టడంతో పాటు డ్వాక్రా గ్రూపు, అంగన్‌వాడీ భవనాలు నిర్మించుకున్నామని గుర్తుచేశారు.

అప్పటి చైర్‌పర్సన్ సునీత సంపత్ హయాంలోనూ పారిశుధ్య పనులు జరిగాయని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి వార్డులో పర్యటించినప్పుడు చెత్త సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లామని, ఎమ్మెల్యే ఆదేశాలతో తొలగింపు పనులు చేపట్టారని తెలిపారు.

గొల్ల చెరువు నుంచి పాత తాండూరు వరకు సుమారు రూ.3 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారని చెప్పారు. గత ఐదేళ్లలో 20వ వార్డుకు తాము చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసని, వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.


