అంగన్‌వాడీ ఎంపికల్లో వార్డుల గందరగోళం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అంగన్‌వాడీ ఎంపికల్లో వార్డుల గందరగోళం..!
– మాణిక్‌నగర్‌ టీచర్‌ పోస్టుకు 64 మందికి పైగా దరఖాస్తులు
– వార్డు గెజిట్‌పై అభ్యర్థుల్లో అయోమయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అంగన్‌వాడీ టీచర్ల ఎంపిక ప్రక్రియలో వార్డుల పరిధిపై గందరగోళం నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో రూపొందించిన డోర్‌ నంబర్లు, వార్డుల వారీగా ఓటర్లను జతచేసిన గెజిట్‌ను అంగన్‌వాడీ పోస్టుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధానం వల్ల అసలైన అర్హులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని మాణిక్‌నగర్‌ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుకు వివిధ వార్డులకు చెందిన ఎస్సీ అభ్యర్థులు 64 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే మాణిక్‌నగర్‌ పరిధికి సంబంధించి వార్డు నంబర్ల విషయంలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాణిక్‌నగర్‌ 14వ వార్డు పరిధిలో ఉన్నప్పటికీ, అంగన్‌వాడీ ఎంపికకు సంబంధించిన గెజిట్‌లో 13వ వార్డుగా చూపించడంపై అభ్యర్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

మాణిక్‌నగర్‌ పేరుతో నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ స్వీపర్‌ కాలనీ, పోలీస్‌ క్వార్టర్స్‌, పోచమ్మ టెంపుల్‌ ప్రాంతాలతో పాటు కళల్‌ గల్లీ పరిధిలోని వార్డు నంబర్ల విషయంలో గందరగోళం నెలకొందని అభ్యర్థులు చెబుతున్నారు. 15, 16, 17వ వార్డులకు చెందిన వారు మాణిక్‌నగర్‌ పోస్టుకు ఏ ప్రాతిపదికన అర్హులవుతారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో 14వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు దరఖాస్తుదారులకు, అంగన్‌వాడీ ఎంపిక గెజిట్‌ ప్రకారం వారు 13వ వార్డు పరిధిలోకి వస్తారని అధికారులు చెప్పడంతో అయోమయానికి గురైనట్లు తెలుస్తోంది. వార్డుల పరిధిలో ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు.

స్థానిక అర్హతల విషయంలో సంబంధిత వార్డులో జన్మించినవారితో పాటు ఆ వార్డుకు కోడలిగా వచ్చినవారికి ఉన్న అర్హతలపై కూడా స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. వార్డుల వారీగా గెజిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం..!