ఆ గ్రామాలకు ఉపసర్పంచుల ఎన్నిక పూర్తి
– మల్కాపూర్‌లో అబ్దుల్ మాజిద్, అంతారంలో తాండాలో కె. దేవల ఎన్నిక
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతి ఎన్నికల్లో చేసుకున్న ఒప్పందం మేరకు తాండూరు మండలం మల్కాపూర్, అంతారం తాండాలలో ఉపసర్పంచులు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉపసర్పంచుల పదవులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించి నిర్వహించిన ఉపసర్పంచ్ పదవుల ఎన్నిక ఏకగ్రీవం కావడం విశేషం. మల్కాపూర్‌లో ఉపసర్పంచ్ అబ్దుల్ మాజిద్, ఆంతాంధ్ర తాండాలో కె.దేవలను ఆయా గ్రామాల వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మల్కాపూర్ గ్రామంలో గతంలో ఉపసర్పంచ్ హసన్ పటేల్ కొనసాగారు. అంతారం తాండాలో ఉపసర్పంచ్ రాములు నాయక్ కొనసాగారు. పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచుల పదవులకు రెండున్నరేళ్లు పదవికాలం ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు మల్కాపూర్‌లో ఉప సర్పంచ్ పదవికి హసన్ పటేల్, అంతారం తాండాలో రాములు నాయకులు కొన్ని నెలల క్రితం వారి పదవులకు రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఉపసర్పంచ్ పదవులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు. మల్కాపూర్‌లో ఎన్నికల అధికారిగా ఎంపీఓ రతన్ సింగ్ వ్యవహరించారు. ఆర్ఐ రాజారెడ్డి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి, మాజీ ఉపసర్పంచ్ హసన్ పటేల్‌ల సమక్షంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ మాజిద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మరోవైపు అంతారం తాండాలో ఎన్నికల అధికారిగా డిప్యూటీ తహసీల్దార్ ధనుంజయ్ వ్యవహరించగా సర్పంచ్ సావిత్రి రాంచందర్, మాజీ ఉపసర్పంచ్ రామలు నాయక్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యుల సమక్షంలో ఉపసర్పంచ్ గా కె.దేవలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారులకు ఉపసర్పంచ్ ఎన్నిక పత్రాలను అందజేశారు. ఇక నుంచి పంచాయతీ పాలకవర్గ సభ్యులు పదవి కాలం ముగిసే వారకు వారు ఆయా గ్రామాలకు ఉపసర్పంచులుగా కొనసాగనున్నారు.

