జిల్లాలోని ఎస్టీ నిరుద్యోగ‌ యువ‌త‌కు శుభ‌వార్త‌

కెరీర్ తాండూరు వికారాబాద్

జిల్లాలోని ఎస్టీ నిరుద్యోగ‌ యువ‌త‌కు శుభ‌వార్త‌
– పోటీ ప‌రీక్షల కోసం ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం
– ప్ర‌క‌టించిన వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి కె.నిఖిల‌
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లాలోని ఎస్టీ నిరుద్యోగ యువ‌తకు జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి కె.నిఖిల శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌ర్తి చేసే ఉద్యోగాల కోసం పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న యుత‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్న‌ట్లు, ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే గ్రూప్-1, గ్రూప్-2 మరియు పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో 100 మంది ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించారు. పరిగి పట్టణ కేంద్రం లోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో వచ్చే నెల మే 1 నుండి ఉచిత శిక్ష‌ణ శిబిరం ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రూప్-4 అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలని, 18 నుండి 47 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని అన్నారు. అంతేకాకుండా కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఉచిత శిక్షణ కేంద్రాలలో శిక్షణ తీసుకొని ఉన్న‌ వారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, వేరే కోర్సులలో శిక్షణ తీసుకున్న వారు ఈ శిక్షణకు అనర్హులని స్ప‌ష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 4 నుండి 11వ తేది సాయంత్రం 5 గంటల వరకు http://studycircle.cgg.gov.in/tstw అనే వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ అవ‌కాశాన్నిజిల్లాలోని ఎస్టీ నిరుద్యోగ యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.