చైర్ పర్సన్ వర్సెస్ టౌన్ ప్రెసిడెంట్
– మంత్రి కార్యక్రమం గైర్హజరుపై చైర్ పర్సన్‌ను నిలదీసిన పట్టణ అధ్యక్షులు
– బహిరంగ విమర్శలు చేయడం సబబు కాదు: హెచ్చరించిన చైర్ పర్సన్
– తాండూరులో చర్చనీయాంశంగా మారిన గులాబీ రాజకీయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ టీఆర్ఎస్ రాజకీయాలు మరోసారి దుమారానికి గురయ్యాయి. మున్సిపల్ చైర్ పర్సన్ వర్సెస్ టౌన్ ప్రెసిడెంట్ మద్య చోటు చేసుకున్న వాగ్వివాదం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు దారితీసిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలో విలీనమైన రాజీవ్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)లు హాజరయ్యారు. కార్యక్రమం తరువాత పట్టణ అధ్యక్షులు అఫ్పూ చైర్ పర్సన్ స్వప్నతో మాట్లాడారు.
ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన రైతుబంధు వారోత్సవాల కార్యక్రమానికి ఎందుకు గైర్హాజరు అయ్యారని అడిగారు. కావాలనే కార్యక్రమాలకు గైర్హాజరు అవుతున్నాయని ద్వజమెత్తారు. ఇందుకు చైర్ పర్సన్ స్వప్న వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం కారణంగా రాలేకపోయాయని, ఈ సమాచారాన్ని మంత్రి సబితారెడ్డికి వివరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ అదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలపై సమాచారం ఇస్తున్న ఎందుకు హాజరుకావడం లేదని చైర్ పర్సన్ స్వప్నను పట్టణ అధ్యక్షులు అఫ్పూ ఘాటుగా ప్రశ్నించారు. పార్టీ వ్యవహారాలపై నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారం తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయనేలా ఈ వ్యవహారం తలపించింది.
బహిరంగా విమర్శలు తగదు : చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
దీనిపై చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ధీటుగా.. ఘాటుగా స్పందించారు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తనపై బహిరంగా విమర్శలకు దిగడం తాండూరు పట్టణ పార్టీ అధ్యక్షులు అఫ్పూకు తగదని అభిప్రాయ పడ్డారు.
తమ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేదని అన్నారు. కార్యక్రమానికి హాజరుకాకపోయిన విలియమూన్ చౌరస్తా నుంచి ఫ్లెక్సీలు వేయడం జరిగిందని, పార్టీ గౌరవాన్ని దెబ్బతీయకుండా నడుచుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి గారి కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు తన సతీమణి కౌన్సిలర్ హోదాలో ఉండి కాలేదని, దీనిపై ఎందుకు ప్రశ్నించరని అన్నారు. పార్టీ కార్యాలయంలో చర్చించుకోవాల్సిన విషయాన్ని బహిరంగంగా విమర్శించడం తగదన్నారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అంటే ఏదో అనుకోవద్దని, ఇష్టారాజ్యంగా నడుకోవడం మంచిది కాదన్నారు. అదేవిధంగా చైర్ పర్సన్ భర్త, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న స్వప్న పరిమళ్‌ను నడిరోడ్డుపై కించపరచడం మంచిది కాదన్నారు.

