సెల్లూ బాబులూ.. జాగ్రత్త..!
– బ్యాంకింగ్ యాప్‌లలో కొత్త వైరస్
– టెమ్టై క్లిక్ చేస్తే ఖాతా మొత్తం ఖాళీ
– వ్యక్తిగత సమాచారం కూడ హ్యాకింగ్
దర్శిని డెస్క్ : సెల్ బాబులు జరంత జాగ్రత్త అంటూ సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీకు కారు కావాలా.. దాని వాల్యూకి సరిపడా డబ్బు కావాలా అనే ఆఫర్లు ఇస్తూ సైబర్ కేటుగాళ్లు సెల్‌ఫోన్లకు కొత్త వైరస్‌ను ఎక్కిస్తున్నారని, ఆఫర్లకు టెమ్ట్ అయ్యారో క్లిక్ చేస్తే ఖాతా మొత్తం ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అతి సులువుగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడిన తినమరిగిన సైబర్ నేరగాళ్లు.. అనేక దారులను అమాయకులకు వలలు వేస్తున్నారు. పూటకో ప్లాన్ వేసి మోసాలకు తెగబడుతున్నారు. డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్‌ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది.
హడలెత్తిస్తున్న కొత్త వైరస్
వైరస్‌ల రూపంలో సైబర్ బూచోళ్లు అందరి సెల్ ఫోన్లలోకి చొరబడుతున్నారు. ఇప్పటి వరకు మెసేజ్‌ల ద్వారా బురిటీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా వైరస్‌లను సృష్టించి జనాల ఫోన్లలోకి వదులుతున్నారు. తాజాగా సోవా పేరుతో ఒక వైరస్ మొబైల్ ఫోన్లలోకి పంపిస్తున్నారు. దీని ద్వారా క్షణాల్లో మీ ఫోన్ హాక్ అయి పూర్తిగా వారి ఆధీనంలోకి వెళిపోతుంది. వెంటనే డాటా మొత్తం హాకింగ్ చేసుకుంటారని బ్యాంకింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అలా చేస్తే ప్రమాదమే
ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు సోవా మొబైల్ బ్యాంకింగ్ మాల్‌వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు మెసేజ్ పంపిస్తున్నారు. అందులో ఉన్న పొరపాటున క్లిక్ చేస్తే చాలు. ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇక ఫోన్ మీ చేతిలోనే ఉన్నా దానిలో సమాచారం అంతా వారి గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. క్షణాల్లో ఖాతా ఖాళీ అవుతుంది. సోవా మాల్‌వేర్ ఫోన్లలో చేరి, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు, నెట్- బ్యాంకింగ్ యాప్‌లను వాడినపుడు పాస్‌వర్డ్‌లను దొంగిలిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్‌లో చేరితే..దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం నిపుణులంటున్నారు. ఈ వైరస్ ఎక్కువగా మెసేజ్‌ల రూపంలోనే వస్తోంది. ఒక్కసారి ఫోన్‌లో చేరాక.. అందులో ఉన్న యాప్‌ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకొని, మాల్‌వేర్‌ను పంపించి ఖాతా ఖాళీ చేస్తున్నారు.

ఈ బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్త
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సోవా వైరస్ విషయంలో బ్యాంకులకు సమాచారం ఇచ్చింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో పాటు పలు బ్యాంకులు ఈ విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ఏకంగా 200 రకాలకు పైగా బ్యాంకింగ్, పేమెంట్ లావాదేవీలను గుర్తించడంతోపాటు, క్రిప్టోకరెన్సీ వాలెట్లనూ ఇది లక్ష్యంగా చేసుకుంటోందని చెబుతున్నారు. కావున ఆయా బ్యాంకుల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలనిసూచిస్తున్నారు.
అవగాహన పెంచుకోండి
అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు యాప్‌ల ద్వారా వీలవుతుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారుల ప్రయోజనం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అవగాహనతో వీటిని వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, మోసగాళ్లు ఈ బ్యాంకింగ్ యాప్‌లను పోలినట్లుగానే మరో నకిలీ యాప్‌లను సృష్టిస్తున్నారు. సోవా వైరస్ విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలంటూ బ్యాంకులు సూచిస్తున్నాయి. ఆఫీషియల్ యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. యాప్ ఉపయోగించుకునేందుకు అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని అందించాలంటున్నారు. క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు అక్టోబర్ 1 నుంచి టోకనైజేషన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. యాప్‌లు ఇస్తున్న అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వచ్చే వెబ్‌సైట్ లింకులను ఎట్టి పరిస్థిత్లుల్లోనూ క్లిక్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు.

