రైతు సంక్షేమమే ధ్యేయం..!
– మార్కెట్ కమిటి అభివృద్ధికి తోడ్పాటు
– యేడాది లోపు కొత్త మార్కెట్ యార్డు ప్రారంభం
– ప్రాజెక్టులతో రైతులకు సాగునీరందించేందుకు కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా మార్కెట్ కమిటి పాలకవర్గ ప్రమాణ స్వీకారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో మార్కెట్ కమిటి చైర్మన్‌గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా షేక్ ఖాసిం, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

రైతులకు మరింత మేలు జరిగేలా మార్కెట్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. మెరుగైన సేవలు అందిస్తూ మార్కెట్‌కు, పాలకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అదేవిధంగా ఒక సంవత్సరంలోపు నూతన మార్కెట్ యార్డును ప్రారంభించేందుకు దృష్టిసారించడం జరుగుతుందన్నారు. తానోక రైతుగా రైతుల కష్టాలు, బాధలు తెలుసని, అందుకే రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కోట్‌పల్లి, జుంటుపల్లి, శ్రీరాముల వారి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

కాగ్నానదిపై అవసరమైన చోట చెక్‌డ్యాంలు కూడా నిర్మించేందుకు డీపీఆర్‌లను సిద్దం చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రైతులకు సాగునీరుతో పాటు తాండూరు పట్టణ ప్రజలకు కాగ్నా నది నుంచి తాగునీరు అందించి శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పిస్తామని అన్నారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోకుండా కృషి చేసిన బీఎల్ఓలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, నాయకులు అఫ్పూ(నయూం), యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


