మే లోనే ఇంటర్ ఫలితాలు
– జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం
– కసరత్తు చేస్తోన్న అధికారులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర ఫలితాల వెల్లడి, కళాశాలల ప్రారంభంపై బోర్డు అధికారులు దృష్టిసారించారు. ఇటీవలే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. గత బుధవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తయ్యాయి. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు 4,02,630 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి ఫలితాలపై పడింది. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ ఇంటర్ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి తెలంగాణ ఇంటర్ బోర్డ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని భావిస్తోన్న అధికారులు అంతలోపు ఫలితాల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రెండు మూడు రోజుల వ్యవధిలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఫలితాలకు సంబంధించి వారం, పది రోజుల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

