ఆరోగ్యాన్ని కాపాడే కాకర రసం
– మేలు చేసే ప్రయోజనాలు ఎన్నో
– షుగర్ బాధితులకు దివ్య ఔషదం
దర్శిని డెస్క్ : కాకర కాయ అనగానే అందరికి చేదు అనే గుర్తు వస్తుంది. ఎంత చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మాత్రం రక్షణ ఇస్తుందని మన పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా కాకర రసంతో పలు వ్యాధులను నియంత్రించడంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎంతో మేలు జరుగుతుందని, చేదుగా ఉంటుందనే కారణంతో కాకరను పక్కనపెట్టడం పొరపాటని అంటున్నారు. కాకర పోషకాల గనితో పాటు వ్యాధులను మన దరిచేరకుండా చూస్తుందని చెబుతున్నారు. మరి కాకర రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
మెరుగైన జీర్ణ వ్యవస్ధ : కాకరకాయ రసంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడంతో పాటు మలబద్ధకాన్ని నివారించేందుకు ఫైబర్ తోడ్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్ నివారణలోనూ కాకర కాయ రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది.
కొవ్వుకు చెక్ : గుండె జబ్బులకు దారితీసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను కాకర జ్యూస్ అదుపులో ఉంచుతుంది. కాకర రసంతో హృద్రోగాల బారినపడకుండా గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు.
ఇమ్యూనిటీ బూస్టర్ : కాకర రసంలో ఉండే విటమిన్ సీతో చర్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని సమకూరుస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్ధ బలంగా ఉంటే పలు వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి అది మనల్ని కాపాడుతుంది.
వ్యర్దాల తొలగింపు : కాకర రసాన్ని రోజూ తీసుకుంటే శరీరంలోని మలినాలను తొలగించే ప్రక్రియ వేగవంతమవుతుంది. కాకర రసం రక్తం, లివర్‌లో వ్యర్ధాలను తొలగించడమే కాకుండా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అధిక బరువు నియంత్రణ : బరువు నియంత్రణలో కాకర కాయ రసం ఇతోధికంగా తోడ్పడుతుంది. కాకర జ్యూస్‌తో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. బరువు తగ్గడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
షుగర్‌కు మేలు : కాకరకాయ రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీని రసాన్ని అరకప్పు తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది.
మరిన్ని ప్రయోజనాలు : చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కాకరకాయ రసం చాలా మేలు చేస్తుంది. ఆర్థరైటిస్‌లో నొప్పికి ప్రధాన కారణం రక్తంలో మలినాలు ఉండటం కాబట్టి చేదు కాకరకాయ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. కాకరకాయ రసం తాగడం వల్ల అతిగా మద్యం సేవించిన మత్తు తొలగిపోయి కాలేయం కూడా శుభ్రపడుతుంది. రెండు చెంచాల పచ్చి కాకరకాయ రసాన్ని సమాన పరిమాణంలో తెల్ల ఉల్లిపాయ రసంతో కలిపి రోజూ తీసుకుంటే కలరా నయమవుతుంది.
ఇది కూడా చదవండి…


