మానవత్వం చాటిన మంత్రి మహేందర్ రెడ్డి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మానవత్వం చాటిన మంత్రి మహేందర్ రెడ్డి
– బైకు పైకి దూసుకొచ్చిన టిప్పర్
– విలేకరికి, యువకుడికి గాయాలు
– బాధితులను దగ్గరుండి అంబులెన్స్ లో ఎక్కించిన మంత్రి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుల పట్ల రాష్ట్రసమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖమంత్రి మహేందర్ రెడ్డి మానవత్వం ప్రదర్శించారు. అతివేగంతో ఓ టిప్పర్ బైకుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విలేకరి, మరో యువకుడు గాయాల పాలయ్యారు. అటుగా వెళుతున్న మంత్రి మహేందర్ రెడ్డి అంబులెన్స్ లో బాధితులను ఎక్కించి.. ఆసుపత్రికి తరలించేలా చొరవ చూపారు.

మంగళవారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ధారూర్ మండలంకు చెందిన శ్రీశైలం ఆంధ్రప్రభ దినపత్రికలో మండల రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. మంగళవారం అతని అన్న కుమారుడు ప్రసాద్ తో కలిసి బుల్లెట్ బైకు పై తాండూరుకు వస్తున్నారు. మార్గ మధ్యలోని కందనెల్లి సమీపంలోని జీపీఆర్ గార్డెన్ వద్దకు రాగానే టిప్పర్ వీరి బైకుకు ఢీకొట్టింది. దీంతో శ్రీశైలం, అతని అన్న కుమారుడు ప్రసాద్ కు గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళుతున్న మంత్రి మహేందర్ రెడ్డి కారు దిగి సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.

వెంటనే అంబులెన్స్ రావడంతో బాధితులను అందులో ఎక్కించి తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చొరవ చూపారు. అదేవిధంగా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా సూచించారు. అంబులెన్స్ లో బాధితులను తాండూరులోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్ తరలించాలని సూచించారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాండూరు నుంచి వికారాబాద్ లోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంభీకులు తెలిపారు. మరోవైపు రోడ్డు ప్రమాదం తరువాత మంత్రి మహేందర్ రెడ్డి చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..

మోగిన ఎలక్షన్ నగారా..!