మనోహర్ రెడ్డి ఆస్తుల చిట్టా..!
– అఫిడవిట్‌లో భారీగా భూములు, ఆస్తులు
– భార్య పేరుపై కూడా స్థిర, చర ఆస్తులు
– బ్యాంకులో ఎన్ని కోట్ల అప్పు ఉందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని ఆస్తుల చిట్టా బహిర్గతం అయ్యింది. ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సమర్పించిన ఆఫిడవిట్‌లో ఆయనతో పాటు భార్యకు సంబంధించిన ఆస్తుల వివరాలను సమర్పించారు. శనివారం తాండూరు రిటర్నింగ్ కార్యాలయంలో బుయ్యని మనోహర్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనతో పాటు భార్య పేరుపై ఉన్న స్థిర, చర ఆస్తులతో పాటు వాటా కింద దక్కిన ఆస్తుల వివరాలను, బ్యాంకులకు ఉన్న అప్పులను వెల్లడించారు. మనోహర్‌రెడ్డితో పాటు ఆయన భార్య పేరిట ఉన్న స్థిర ఆస్తుల విలువ రూ.65 కోట్లుగా చూపించారు.
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మనోహర్ రెడ్డి పేరిట ఉన్న స్థిర ఆస్తుల విలువ రూ.53 కోట్లు.. ఇందులో స్వయంగా కొనుగోలు చేసిన స్థిర ఆస్తుల విలువ రూ.47 కోట్లు కాగా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల విలువ రూ.5.75 కోట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన భార్య పేరిట స్థిర ఆస్తుల విలువ రూ.12.38 కోట్లుగా పేర్కొన్నారు. మనోహర్ రెడ్డి తన పేరిట ఉన్న చరఆస్తుల విలువ రూ.7.69 లక్షలుగా పేర్కొన్నారు. భార్య పేరిట ఉన్న చరఆస్తుల విలువ రూ.58.53 లక్షలుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మనోహర్రెడ్డి పేరిట నాలుగు వాహనాలు ఉండగా 50 గ్రామాల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య అరుణ పేరిట 1000 గ్రాముల బంగారంతో పాటు రెండు కిలోల వెండి ఉన్నట్లు చూపించారు. స్థిర ఆస్తుల వివరాలకు వస్తే మనోహర్ రెడ్డి పేరిట అనేక చోట్ల భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. కుల్కచర్ల మండలం తిరుమలాపూర్లో 11.20 ఎకరాలు, యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని వివిధ సర్వేనెంబర్లలో 6.09 ఎకరాల భూమి, కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో తన వాటాగా ఉన్న 2 ఎకరాలు, చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో తన వాటా కింద 3 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. మొత్తంగా తన పేరిట 17.29 ఎకరాలు, వాటా కింద 5.09 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించారు. భార్య అరుణ పేరిట ఎలాంటి భూములు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు.
అబ్దుల్లాపూర్మెట్ మండలం మన్నెగూడ గ్రామంలోని బిఎంఆర్ సార్థా కన్వెన్షన్లో మనోహర్ రెడ్డికి 25 శాతం వాటా, భార్య అరుణకు 25 శాతం వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలలో ఉన్న వాణిజ్య, ఇంటి స్థలాల వివరాలను ప్రకటించారు. చాలా కాలంగా కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి రియల్ వ్యాపారంలో ఉండడంతో అనేక ప్రాంతాలలో భూములు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మనోహర్రెడ్డి తన చేతిలో రూ.60 వేల నగదు.. భార్య అరుణ చేతిలో రూ.40 వేల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మనోహర్రెడ్డి తన పేరిట ఐదు బ్యాంకు ఖాతాలలో రూ.5 లక్షల పైబడి మాత్రమే నగదు ఉన్నట్లు చూపించారు. భార్య అరుణ పేరిట ఉన్నఏకైక బ్యాంకు ఖాతాలో రూ.59 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. మనోహర్ రెడ్డి తన పేరిట బ్యాంకులో అప్పు రూ.7.95 కోట్లు ఉన్నట్లు చూపించారు.
ఇదికూడా చదవండి…

