ఎందుకు సార్.. అలా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎందుకు సార్.. అలా..!
– అసెంబ్లీ ఆంక్షల అమల్లో విఫలం
– పోలీసుల తీరుపై నేతలు, ఓటర్ల అసంతృప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. వాగ్వివాదాలతో ప్రశాంతంగా ముగిశాయి. అయితే తాండూరు పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ఆంక్షలను అమలు చేయడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వినిపించాయి. ఇందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సెల్ ఫోన్లు అనుమతి నిషేధం అని పోలీసు శాఖ స్పష్టంగా పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వద్దకు నలుగురు, ఐదుగురుకు మించి రావద్దని, ఉండవద్ద నిబంధన కూడ ఉంది.

పట్టణంలోని గాంధీనగర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద బయటి వ్యక్తులు వచ్చారంటూ బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులు దృష్టిసారించకపోవడంతో కొద్ది సేపటికే రాజకీయ నేతల తాకిడి పెరిగింది. దీంతో వివాదం కాస్తా పోలింగ్ కేంద్రం వద్దే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మద్య యుద్ద వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు నేతలను తరిమేయకుండా మీడియాపై దౌర్జన్యానికి పాల్పడడం వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోలింగ్ కేంద్రాల తనిఖీ సమయంలో నేతలు, కార్యకర్తలు ఆంక్షలకు విరుద్దంగా వెళ్లడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద సెల్పీలు అంటూ సందడి చేయడం వివాదాస్పదంగా మారింది. సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పోలింగ్ కేంద్రం వద్ద ఇదే తరహ పరిస్థితి కనిపించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ స్వయంగా ఆందోళన కారులను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనలతో ఆంక్షల అమలులో పోలీసులు విఫలం అయ్యారని విమర్శలు వినిపించాయి. మరోవైపు పోలీసు శాఖ నుంచి విధుల ఒత్తిడిలో భాగంగా అన్ని పార్టీల నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందని, ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నడుచుకోవడం జరిగిందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆంక్షలను పాటించలేదని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!