ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నిర్ణయం ఇదే
– పైలెట్ పర్యటన పేరు మార్పు
– రేపటి నుంచి కలిసి వార్డుల్లోకి ఇరువర్గాల నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు సోమవారం కలిసిపోయారు. ఎమ్మెల్సీ నివాసంలోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిలు భేటీ కావడంతో విశేషత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు పట్టణంలో గల్లి గల్లికి పైలెట్ పేరుతో వార్డుల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన పేరును మార్చాలని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ విజ్ఞప్తి మేరకు గల్లి గల్లికి పైలెట్ కార్యక్రమాన్ని గల్లి గల్లికి ఎమ్మెల్యేగా మార్చినట్లు తెలిసింది. దీంతో రేపు మంగళవారం ఉదయం నుంచి జరిగే పర్యటనలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాలకు చెందిన నేతలు, కౌన్సిలర్లు కలిసి పర్యటించబోతున్నట్లు తెలిసింది. ఈ భేటీలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
