
స్వీప్ చేసి.. స్లీప్..!
– చోరి చేసిన ఇంట్లో గుర్రు పెట్టిన దొంగ
– పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలు
– సోషల్ మీడీయాలో వైరల్ అయిన సంఘటన
దర్శిని డెస్క్ : టార్గెట్ చేసిన ఇండ్లను సైలెంట్‌గా దోచుకెళ్లడం దొంగల ఆనవాయితీ. ఈ దొంగ మాత్రం సెలెక్ట్ చేసుకున్న ఇంటిని స్వీప్ చేసి కాస్త స్లీప్ వేశాడు. చోరి చేసిన ఇంట్లోనే గుర్రుపెట్టి నిద్రపోవడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో దొంగకు ఎదురైన విచిత్ర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే… పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నో నగరంలోని ఇందిరా నగర్ సెక్టర్ – 20లో సునీల్ పాండే అనే వైద్యుడికి ఇళ్లు ఉంది. బలరామ్‌పూర్ హాస్పిటల్లో పనిచేసే డా.పాండే ప్రస్తుతం వారణాసిలో డ్యూటీ చేస్తున్నారు. దీంతో, లక్నోలోని ఇల్లు ఖాళీగా ఉంచారు. దీన్ని గమనించిన దొంగ ఓ రాత్రివేళ ఇంట్లోకి చొరబడి అల్మారా పగలగొట్టి అందులో ఉన్న నగలు, నగదు దోచుకున్నాడు. వాష్‌బేసిన్, గ్యాస్ సిలిండర్, నీటి పంపును సైతం దొంగలించడానికి ప్రయత్నించాడు. హౌస్ బ్యాటరీని తొలగిస్తుండగా మత్తుగా అనిపించి అక్కడే నిద్ర పోయాడు. పాండే ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారికి అనుమానం కలిగింది. వెళ్లి చూడగా లోపల ఓ దొంగ గుర్రతీస్తూ కనిపించాడు.

ఇళ్లంతా చిందరవందరగా ఉన్నాయి. అతని పక్కనే రెండు గోనె సంచులు సామానుతో నింపి ఉన్నాయి. దీంతో, వారు వెంటనే సదరు ఇంటి ఓనర్‌తో పాటు… పోలీసులకు సమాచారం అందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… పోలీసులు వెళ్ళి లేపేవరకు ఆ దొంగ పడుకునే ఉన్నాడు. లేవగానే పోలీసులను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఒక్కసారిగా కంగుతిన్న దొంగ చేసేదేమీ లేక లొంగిపోయాడు. మరోవైపు కొన్ని నెలల క్రితం ఓ దొంగతనం కేసు అరెస్టైన నిందితుడు.. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

