కొత్త యేడాది పేదలకు కానుక..!
– రేషన్ లబ్దిదారులకు సన్న బియ్యం
– ప్రకటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ సర్కారు కొత్త యేడాది కానుకను అందించేందుకు సిద్దమయ్యింది. రేషన్ లబ్దిదారులకు 2025 జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2025 జనవరి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. దీనిని దేశ చరిత్రలోనే ఓ మైలు రాయిగా అభివర్ణించారు. ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి గందరగోళం ఉత్పన్నం కాకుండా రైతులకు మద్దతివ్వడానికి ప్రజాప్రతినిధులు క్షేత్ర పర్యటనలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

