రేపటి నుంచి ఒంటిపూట బడులు
– ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు కొనసాగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. మ. 12:30 గంటలకు మధ్యాహ్నం భోజనం పెట్టి, విద్యార్థులను ఇంటికి పంపనున్నారు. మే 20వ తేది వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని, అదేరోజు ఈ విద్యా సంవత్సరానికి చివరి పనిదినం అవుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా పరీక్షలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

