తైబజార్ రేట్లు ఖరారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తైబజార్ రేట్లు ఖరారు..!
– వీధి వ్యాపారులపై భారం
– ఒక్కోదానికి ఒక్కో ధర
– వసూళ్లకు రంగం సిద్దం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో వందల ఏండ్ల నుంచి తాండూరు వ్యాపార కేంద్రంగా ప్రసిద్ది చెందింది. నియోజకవర్గానికి తాండూరు పట్టణం గుండెకాయగా నిలుస్తుంది. చింతపండు, గుండుసూది, కట్‌చీఫ్ నుంచి అన్ని రకాల వ్యాపారాలు జరుగుతాయి. తాండూరు పరిసర ప్రాంతాల ప్రజలు పట్టణానికి వచ్చి వ్యాపారాలు చేసుకుని జీవనం గడుపుతున్నారు. ఇక తాండూరులో రోడ్లపై వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారులపై ఆర్థిక భారం పడనుంది.

తాజాగా మున్సిపల్ అధికారులు తైబజార్ ఫీజుల వసూళ్లకు రంగం సిద్దం చేశారు. బహిరంగ వేలం నిర్వహించి ఓ కాంట్రాక్టర్‌కు ఫీజులు వసూలును అప్పగించారు. పట్టణ పరిధిలోని 36 వార్డులలో ఎక్కడైనా సరే రోడ్లపై వ్యాపారాలు చేసుకునే వారి నుంచి ఫీజులు వసూలు చేసుకునే అధికారం అప్పగించారు. అంతేకాకుండా ఏయే దానికి ఎంత వసూలు చేయాలని ధరలను కూడా ఖరారు చేశారు. రోడ్లపై బుట్టలు పెట్టుకుని అమ్ముకునే వారి వద్ద రూ. 20లు, షాపులో కూరగాయాలు అమ్ముకునే వారి వద్ద రూ. 40లు, రోడ్లపై బట్టలు అమ్ముకునే వారి వద్ద రూ. 40లు, పెద్ద దుకాణం ఉంటే రూ. 50లు, ఆటోలపై సరుకులు తెచ్చుకుని అమ్ముకుంటే రూ. 40లు, సోడా బండికి రూ. 20లు, ఎండు మిర్చి అమ్ముకునే వారికి రూ. 40లు, మామిడి పండ్లు అమ్ముకునే వారికి రూ. 50లు, ఐస్ క్రీం బండికి రూ. 40లు, చింతపండు గంపకు రూ. 50లు, పూల దుకాణం, అరటిపండ్ల దుకాణంకు రూ. 30లు, టీస్టాల్, బజ్జీల దుకాణం, కూల్ డ్రింక్ షాపుకు రూ. 30లు, చేపల గంపకు రూ. 40లు, సైకిల్‌ పై వ్యాపారంకు రూ. 30, పండ్లు అమ్మకంపై రూ. 40లతో పాటు ఇతర వ్యాపారాలు చేసే వారికి రూ. 50 నుంచి 100లకు పైగా వసూలు చేయాలని నిర్ణయించారు.

నిబంధనలకు విరుద్దంగా వసూళ్లకు పాల్పడితే టెండర్లు రద్దు చేసే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తైబజార్ వల్ల పట్టణంలోని చిరు వ్యాపారులపై ఆర్థిక భారం పడనుంది. ఇదిలా ఉంటే తాండూరులో తైబజార్ ఫీజుల వసూళ్లపై పార్టీల నాయకులు, ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. దాదాపు 12ఏండ్ల క్రితం వరకు తైబజార్‌ ఫీజుల వసూళ్లను ఎత్తివేసిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ తైబజార్ ఫీజుల వసూళ్లను తేవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి….

సీతారాముల కళ్యాణ వైభోగం..!