ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం..!
– జుంటుపల్లి రైతులకు న్యాయం చేయాలి
– బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్‌ పటేల్
– రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతుల పంటలను అడ్డికి పావు శేరు లెక్కనే కొంటున్నారని మండిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను శుభప్రద్ పటేల్ జంటుపల్లి రైతులతో కలిశారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.

తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ 41 కీలోలకు కాంట పెట్టడానికి బదులు 43 కిలోలు తీసుకోవడమే కాకుండా.. రైస్ మిల్లర్లు సైతం 50 బస్తాలు ఉన్న రైతు దగ్గర రెండు బస్తాలు, 70 బస్తాలు ఉంటే 3 బస్తాలు, 100 బస్తాలకు 5 బస్తాలు, 150 బస్తాలకు 8 బస్తాలు కట్ చేస్తూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని తెలిపారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్… అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి న్యాయం చేయాలని అదనపు కలెక్టర్ల లింగ్యానాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి వారం రోజుల్లో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. మాది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల బాధలు కనిపించడం లేదా అన్నారు. కలెక్టర్ చెప్పిన విధంగా జంటుపల్లి రైతులకు వారం రోజుల్లో న్యాయం జరగకపోతే బిఆర్ఎస్ పార్టీ తరుపున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జంటుపల్లి బాధిత రైతులు రాంచందర్, శాంతప్ప, గోవెర్దన్ గౌడ్, ఎండీ సోను, గోవింద్, బీఆర్ఎస్ నాయకులు రవిశంకర్, సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

దొంగగా మారిన ఆటో డ్రైవర్..!