‘ఫ్రెష్‌’గా కల్తీ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

‘ఫ్రెష్‌’గా కల్తీ..!
– గుట్టుగా అల్లం పేస్ట్ తయారి
– లోకల్‌గానే కల్తీ చేస్తున్న వ్యాపారులు
– తనిఖీలో పట్టుకున్న పోలీసులు
– ఆటో డ్రైవర్‌పై కేసు, రిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మీ వంటకాల్లోకి తాజా సువాసను అందించే అల్లం పేస్ట్ అందిస్తామని కొందరు వ్యాపారులు కల్తీ అల్లం పేస్ట్ తయారికి పాల్పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు తరలించే క్రమంలో పోలీసుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల తనిఖీలో లోకల్ కల్తీగాళ్ల గుట్టు రట్టయ్యింది.

కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. యాలాల మండలం కోకట్ రోడ్డు మార్గం ప్లాట్ నెంబర్ 14, 15లో ఆర్పీ ప్రోడక్ట్స్ వారు ఫ్రెష్‌ మేడ్ అనే పేరుతో కల్తీ అల్లం పేస్టు తయారి పరిశ్రమను నడిపిస్తున్నారు. పేస్ట్ తయారి డబ్బాలకు అందమైన స్టిక్కర్లను ఉంచి అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీనికి ఎలాంటి తయారి తేది, గడువు తేది లేదు. రీటైల్ ప్రైజ్‌గా రూ. 900లు పెట్టి అక్రమంగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. శనివారం దుకాణం నుంచి తాండూరు మండలం గౌతాపూర్ మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా కరణ్‌ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో గౌతాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఆటోను గుర్తించి సోదాలు చేయగా సుమారు 87కిలోల కల్తీ అల్లం పేస్టును గుర్తించారు. దీనికి ఎలాంటి అనుమతులు, తయారి గడువులు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. ఆటోను, డ్రైవర్ సజాతుల్లా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. నిందితుడికి 14 రోజుల న్యాయ హిరాసత్ విధించారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, వినియోగదారులు కల్తీ అల్లం పేస్టుపై అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసి అనారోగ్యం పాలు కావద్దని సూచించారు.

ఇదికూడా చదవండి…

పక్కా కమర్షియల్ ఆర్ఐ..!