ఇదేం.. భోజనం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇదేం.. భోజనం..!
– పాత పాత్రల్లోనే వండుతారా..?
– తాండూరు సబ్‌ కలెక్టర్ ఆగ్రహం
– తినకుండానే భోజనం పారబోత
– బషీరాబాద్‌ మండల కేంద్రంలో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇదేం మధ్యాహ్నం భోజనం.. ఇలాగే వండుతారా అంటూ తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మధ్యాహ్న భోజన నిర్వహణపై మండిపడ్డారు. పాత వంట పాత్రల్లోనే వండితేలా విద్యార్థులు ఎలా తింటారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ వెళ్లిన తరువాత విద్యార్థులు రుచి.. పచిలేని మధ్యాహ్న భోజనాన్ని తినకుండానే పారేశారు.

ఈ సంఘటన శుక్రవారం బషీరాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. వంటగదిలో పాత వంట పాత్రల్లో భోజనం వండడం చూసీ ఆశ్చర్య పోయారు. పాత వంట పాత్రల్లోనే భోజనం వండుతారా.. ఇలా వండితే విద్యార్థులు ఎలా తింటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిల్లలకు కొత్త ప్లేట్లు ఇవ్వకుండా పాత వాటిల్లోనే వడ్డించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతిరోజూ పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనంపై దృష్టిసారించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణత్యంగా ఉండేలా పరిశీలించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ వెళ్లిన తరువాత విద్యార్థులు మధ్యాహ్న భోజనంను బయట పారబోశారు. రుచిగా లేనందువల్ల తినలేకపోయామని విద్యార్థులు తెలిపారు. ఈ తనిఖీలో తహసీల్దార్ సాహిదా బేగం, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

భారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
అనంతరం తాండూరు సబ్ కలెక్టర్ బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంను సందర్శించారు. కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను పరిశీలించారు.

సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

బోనమెత్తిన సాయిపూర్..!