ఇసుక తోడేళ్లపై కదం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

kvcs
ఇసుక తోడేళ్లపై కదం..!

– కాగ్నానదికి ఇసుక టిప్పర్ల తూట్లపై ఆగ్రహం
– గోవిందావుపేట్, విశ్వనాథ్ పూర్ గ్రామస్తుల ఆందోళన
– అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాగ్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలింపుకు పాల్పడుతోన్న ఇసుక తోడేళ్లపై నేతలు, గ్రామస్తులు కదం తొక్కారు. గ్రామం మీదుగా అక్రమ రవాణా సాగకుండా అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన యాలాల మండలం విశ్వనాథ్ పూర్ వద్ద జరిగింది.

వివరాల్లోకి వెళితే… గోవిందరావు పేట్ లోని చెక్ డ్యాం వద్ద నుంచి కొన్ని రోజులుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రింబవుళ్లు భారీ టిప్పర్ల ద్వారా అభివృద్ధి పనుల పేరుతో 50 నుంచి 60 టన్నుల ఇసుక రవాణా సాగించారు. కాగ్నానదికి టిప్పర్లతో తూట్లు వేయడం వల్ల గోవిందరావుపేట్ కు చెందిన రైతుల పొలాలలో వ్యవసాయానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సోమవారం సెలవు దినం అయినప్పటికీ ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్నారు.

దీంతో యాలాల మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మాజీ సర్పంచులు అయిల్ రెడ్డి, బసవరాజ్, బాలే సాబ్, అశోక్, మాజీ ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్. భాస్కర చారి, జీవి రెడ్డి, అశోక్, పెండాల రాములు, కిషన్, గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి, నాగప్ప, రైతులు కలిసి ఇసుక రవాణాపై కదం తొక్కారు. గ్రామం మీదుగా ఇసుక రవాణా సాగకుండా అడ్డుకున్నారు. టిప్పర్లు వెల్లకుండా రోడ్డుపై జేసీబీతో గుంతలు తవ్వారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా సాగించడం పట్ల మండిపడ్డారు. అక్రమంగా ఇసుక తరలిస్తే రెవెన్యూ, పోలీసు, మైన్స్ శాఖల అధికారులు మామూళ్ల తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. ఇసుక తరలింపుల వల్ల బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటి పోయి… రైతుల పొలాలకు, వ్యవసాయానికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక రవాణాపై చర్యలు తీసుకుని, అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక అక్రమార్కులపై, పట్టించుకోని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి…

శోభాయామానంగా కాళీకాదేవి ఉత్సవ ఊరేగింపు