మూడు రోజులు సెలవుల్లేవ్..!
– రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ ఆదేశాలు
– సూచనలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజులు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంగళవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్‌లిఫ్టింగ్‌కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు.
‘‘ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. భారీ వర్షాలు పడే జిల్లాలకు సిబ్బందిని ముందుగానే పంపించాలి. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలి. వర్షాలు, వరదలపై మీడియా ద్వారా సమాచారం చేరవేయాలి. వరదలపై ఫిర్యాదు కోసం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలి. విద్యా సంస్థలకు సెలవులపై తగు చర్యలు తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలి. వీలైనంత వరకు ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలి. ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మరోవైపు భారీగా వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సీఎం (review) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

