విద్యార్థులతో సర్కారు చెలగాటం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థులతో సర్కారు చెలగాటం..!
– స్టూడెంట్లను విస్మరిస్తున్న రేవంత్ రెడ్డి
– ఫీజురియంబర్స్ మెంట్లపై కాలయాపన
– తాండూరులో విద్యార్థుల ఆందోళన
– మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు విమర్శించారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్ మెంట్ అసోసియేషన్- తాండూరు ప్రతినిధులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అన్ని డిగ్రీ కాలేజీల నుంచి విద్యార్థులతో కలిసి పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
kvcs
పట్టణంలోని ఇందిరా చౌరస్తా మీదుగా నెహ్రు గంజ్ నుంచి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ముట్టడిని చేపట్టారు. ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు బైటాయించి ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మాధవ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ తదితరులు విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం వారి జీవితాలో చెలగాటం ఆడుతోందని అన్నారు. రైతులకు, ఇతర పథకాలకు నిధులు చేసిన ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా విస్మరిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రిని నియమించకుండా, పదవిని తానే ఉంచుకుని విద్యార్థుల ద్రోహిగా మారుతున్నారని అన్నారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించడం చేతకావడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఫీజురియంబర్స్ మెంట్ చెల్లిస్తాం, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందిస్తాం, స్కూటర్లు అందిస్తామని దొంగ హామిలు ఇచ్చి మోసం చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని అన్నారు. మరోవైపు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రాక కాలేజీల యమాజన్యలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యార్థులకు ఫీజురియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖాపురం ఆంజనేయులు, సందీప్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి శ్రీహరి, అసెంబ్లీ ఇంచార్జ్ రజనీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, వినయ్, బీఆర్ఎస్ నాయకులు భాను, ప్రైవేటు డిగ్రీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మీ సేవల్లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు..!