ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు యూత్ కాంగ్రెస్ సెగ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు యూత్ కాంగ్రెస్ సెగ‌
– కార్యాల‌యాన్నిముట్ట‌డించిన నాయ‌క‌లు
– నిరుద్యోగుల భృతి చెల్లించాలని డిమాండ్
– అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రాష్ట్రంలో నిరుద్యోగ‌ల‌కు భృతి చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ చేప‌ట్టిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్ట‌డికి యూత్ కాంగ్రెస్ నాయ‌కులు సెగ త‌గ‌లించారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు, నిరుద్యోగ భృతి హామీలను నెర‌వేర్చాల‌ని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షులు శివ‌సేనా రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్ట‌డికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శ‌నివారం తాండూరు యూత్ కాంగ్రెస్ నాయ‌కులు హైద‌రాబాద్ రోడ్డు మార్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డ‌గించి అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్ట‌డిలో భాగంగా యూత్ కాంగ్రెస్ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్ కుమార్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ముట్టడికి య‌త్నించారు. మ‌రోవైపు జిల్లా ఉపాధ్య‌క్షులు అమీర్ అబ్దుల్లా, యూత్ కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బంటు వేణుగోపాల్‌లు క్యాంపు కార్యాల‌యం స‌మీపంలో ఆందోళ‌న‌కు దిగారు. యూత్ కాంగ్రెస్ జెండాలో నిర‌స‌న చేప‌ట్టారు. అప్ప‌టికే చేరుకున్న పోలీసులు వారిని కూడ అదుపులోకి తీసుకుని పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో నిరుద్యోగుల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్లు వెయ్య‌కుండా కాలం వెల్ల‌దీస్తూ నిరుద్యోగుల‌తో చెల‌గాటం ఆడుతుంద‌న్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మొండి చెయ్యి చూపిస్తుంద‌ని అన్నారు. నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకోక‌పోతే ప్ర‌భుత్వానికి త‌గిన గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

నాయ‌కుల ముంద‌స్తు అరెస్టు, నిర్భందం
మ‌రోవైపు శ‌నివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్ట‌డిని అడ్డుకునేందుకు పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
శుక్ర‌వారం రాత్రి నుంచే నాయ‌కుల నివాసాల వ‌ద్ద పహారా కాశారు. ప‌లువురు నాయ‌కుల‌ను ముంద‌స్తు అరెస్టులు చేసి పోలీస్టేష‌న్‌కు త‌ర‌లించారు. శ‌నివారం ఉద‌యం కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు, కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ తాండూరు నియోజ‌క‌వ‌ర్గ అద్య‌క్షులు సందీప్ రెడ్డి, ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు జోగుల ఎబినేజ‌ర్, మైనార్టీ నాయ‌కులు న‌వాజ్ త‌దిత‌రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.