టీజర్, సినిమా రెండూ చూపించా..!
– ఎగిరిపడితే ఎన్నికల్లో పోటీ కూడా ఉండదు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాట్ వాఖ్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నీకు టీజర్, సినిమా చూపిస్తా అన్న వాళ్లకే ఆ రెండు చూపించామని, ఇంకా ఎగిరితే ఎన్నికల్లో కూడా పోటి చేసే పరిస్థితి లేకుండా పోతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. పరోక్షంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఉద్దేశించి ఈ వాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ గతంలో నేతలు తాండూరు అభివృద్ధిని విస్మరించారని అన్నారు. అభివృద్ధి చేయడం చేతకాక కరోనా సాకును చూపించుకున్నారని విమర్శించారు. రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా తాండూరును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు తానేప్పుడు సిద్దంగా ఉన్నానని చెప్పినా చర్చకు రాలేకపోతున్నారని అన్నారు.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో టీజర్, సినిమా చూస్తామని డైలాగులేస్తే.. ఇప్పుడు అతనికే టీజర్, సినిమా చూపించామని అన్నారు. ఇక అతని టాకీస్ బంద్ అయి పోయిందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి సొంత మండలంలో రోడ్లు వేసుకోలేకపోయారని అన్నారు. ఆసుపత్రిని తీసుకరాలేకపోయారని అన్నారు. ఎమ్మెల్యేగా తాను వచ్చిన తరువాతే రోడ్లు, ఆసుపత్రిలు వచ్చాయని తెలిపారు. ఉత్తుత్తి జీవోలు, హడావుడి శంకుస్థాపలను తప్పా చేసిందేమి లేదని దుయ్యబట్టారు. కోట్‌పల్లి ప్రాజెక్టుపై ఎలాంటి దృష్టిసారించలేకపోయారని, తాను సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో నిధులు తీసుకవచ్చి అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయని, రాజకీయాలు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.


