పాడు కూలీలు..!
– గుట్టుగా గంజాయి విక్రయాలు
– 1.2కేజీల ఎండు గంజాయి స్వాధీనం
– ఇద్దరిపై ఎక్సైజ్ పోలీసుల కేసు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కూలి పనులు చేసుకునే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయాలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఇద్దరు నిందితుల నుంచి ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాషా, తాండూరు పట్టణం ధోబి గల్లికి నవీన్ కుమార్ లు కూలీ పనులు చేస్తున్నారు. అయితే వీరు గుట్టుగా గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది.

వికారాబాద్ జిల్లా ప్రోహిభిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి విజయ్ భాస్కర్, అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వికారాబాద్ డిటిఎఫ్ బృందం దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఇద్దరు స్నేహితుల నుంచి 1.2కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా నిందితుల వద్ద నుంచి ఒక బైకు ఒక సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


