ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..!
– తాండూరు ఎమ్మెల్యేకు ఉద్యోగుల వినతి
– సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే నిర్ణయాన్ని రద్దు చేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని తాండూరు ఉద్యోగులు కోరారు.

మంగళవారం తాండూరు క్యాంపు కార్యాలయంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సమక్షంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో సేవలందిస్తున్న తమ వేతనాల్లో అకస్మాత్తుగా కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని తెలిపారు.

వర్క్ ఇన్స్పెక్టర్లకు రూ.7,150, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.4,250, నాన్-పీహెచ్ వర్కర్లకు రూ.1,000 వరకు వేతనాలు తగ్గించారని వారు పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో వేతనాల కోత తమపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెల్లించిన వేతనాలనే కొనసాగిస్తూ.. IFMIS పోర్టల్‌లో పాత వేతనాలను నమోదు చేసి చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేను కోరారు.

ఉద్యోగుల సమస్యపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. వేతనాల కోత అంశాన్ని శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, నాన్-పీహెచ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


