అరచేతిలోనే డాక్‌ సేవ..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం హైదరాబాద్

అరచేతిలోనే డాక్‌ సేవ..!
– ఆఫీసుకు వెళ్లకుండానే సేవలు
– యూత్‌ కోసం కొత్త పథకాలు
– డిజిటల్‌ విప్లవానికి ఇండియా పోస్ట్‌ శ్రీకారం
దర్శిని డెస్క్ : ఇకపై పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి నుంచే అనేక సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. పార్సిల్‌ పికప్‌ బుకింగ్‌, మెయిల్‌ ట్రాకింగ్‌, బ్యాంకింగ్‌, యూపీఐ, మనీ ఆర్డర్‌ వంటి సేవలను డిజిటల్‌ వేదిక ద్వారా పొందేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రజల కోసం ‘డాక్‌ సేవ’, పోస్టల్‌ సిబ్బంది కోసం ‘డాక్‌ మిత్ర’ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సీటింగ్‌ సదుపాయాలు, డిజిటల్‌ సేవలతో పోస్టాఫీసులను ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. సాంకేతిక ఆధునీకరణ, విధాన సంస్కరణలు, సంస్థాగత మార్పులు, భౌతిక మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
పోస్టల్‌ రంగంలో రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడులతో రియల్‌టైమ్‌ లాజిస్టిక్‌ మానిటరింగ్‌, డిజిటల్‌ కస్టమర్‌ సేవలు, వేగవంతమైన మెయిల్‌ ట్రాకింగ్‌ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 110కిపైగా పోస్టాఫీసులను ఆధునీకరించగా.. ప్రధాన నగరాల్లో మరో 40 పోస్టాఫీసులను రీమోడలింగ్‌ చేస్తున్నారు.

యువతను పోస్టల్‌ సేవలకు మరింత చేరువ చేసేందుకు యూనివర్సిటీల్లో నెక్స్ట్‌ జనరేషన్‌ పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో పోస్టల్‌ సేవింగ్స్‌, పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (PLI), రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (RPLI) తదితర సేవలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఇండియా పోస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

‘డాక్‌ సేవ’ను మరింత విస్తరించి సూపర్‌ యాప్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పోస్టల్‌ సేవలను ఆధునికీకరించడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలపై కూడా దృష్టి సారించిన కేంద్రం.. పోస్టల్‌ రంగానికి ఏటా సుమారు రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో కార్యాచరణ చేపడుతోంది.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..!