దసరా ఉత్సవాలకు దస్తగిరిపేట్ వేంకటేశ్వర ఆలయం ముస్తాబు!
– ఈ నెల 20న విజయదశమి వేడుకలు
– శ్రీవారికి అశ్వవాహన సేవ, శమీ పూజ
తాండూరు, దర్శిని ప్రతినిధి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు సమీపంలోని అంతారం పరిధి దస్తగిరిపేట్ (చంద్రగిరి)లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, ధర్మకర్త పురందరాచార్య శుక్రవార్ తెలిపారు. విజయదశమి వేడుకల్లో భాగంగా స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు.

అనంతరం సంప్రదాయబద్ధంగా శమీ పూజ చేపట్టనున్నారు. అదే విధంగా కార్తీక దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి మహా మంగళహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు.
భక్తులకు ఆహ్వానం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అర్చకులు, ధర్మకర్త పురందరాచార్య శుక్రవార్ కోరారు.

విజయదశమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే పూజలు, వాహన సేవలో భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


