తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తిరంగా.. దేశభక్తి ఉప్పొంగంగా..!
– తాండూరులో ర్యాలీ విజయవంతం
– కదం తొక్కిన నేతలు, సంఘాలు, యువకులు
– ఘనంగా భారత మాజీ సైనికులకు సత్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాకిస్తాన్ పై భారత సైనిక దళాలు అపరేషన్ సిందూరు ద్వారా సాధించిన నేపథ్యంలో తాండూరులో నిర్వహించిన తిరంగా యాత్రలో అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగింది. శనివారం బీజేపీ, కాంగ్రెస్, తిరంగా అభియాన్ కమిటి, పలు సంఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ విజయవంతం అయ్యింది.

పట్టణంలోని నెహ్రు గంజ్ రేణుకా ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయ్యింది. ఈ ర్యాలీలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ బీజేపీ నాయకులు, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు, మాజీ కౌన్సిలర్లు, సంఘాల నాయకులు, యువకులు కదం తొక్కారు. మనం సైతం దేశం కోసం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పట్టణంలోని పుర వీధుల్లో ర్యాలీ దేశభక్తి ఉప్పొంగేలా సాగింది. అనంతరం పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మానవ హారం చేపట్టారు. ర్యాలీలో వందే మాతరం, జాతీయ గీతాలను ఆలాపించారు. చౌరస్తాలో భారత మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ తో పోరాడిన భారత సైనికులకు మద్దతు తెలిపారు. భారత సైనిక దళాలకు మనోధైర్యం నింపడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తో మన సైనికులు తమ శక్తి ఏపాటితో రుచిచూపించారని. మరోసారి భారత దేశంపై ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిన విధంగా దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా నాయకులు కృష్ణ ముదిరాజ్, మనోహర్ రావు, గాజుల శాంతుకుమార్, బంటారం భద్రేశ్వర్, రజనీకాంత్, కాంగ్రెస్ నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సిరలు, బంటు మల్లప్ప, ఆర్యవైశ్య సంఘం నాయకులు అలంపల్లి శ్రీనివాస్, భాను కుమార్, విద్యావేత్తలు సిద్ధలింగయ్య స్వామి, పర్యాద రామకృష్ణ, సంఘాల నాయకులు, యువకులు, దేశభక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కల్వ సుజాతపై ఫిర్యాదు..!