కోట్‌ప‌ల్లి ప్రాజెక్టుకు రాజ‌యోగం క‌ల్పించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

కోట్‌ప‌ల్లి ప్రాజెక్టుకు రాజ‌యోగం క‌ల్పించండి
– రూ. 150 కోట్ల‌తో ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌త్తుకు ప్ర‌ణాళిక‌లు
– ప్ర‌భుత్వం ఆమోదిస్తే వ్య‌వ‌సాయానికి మ‌హ‌ర్ద‌శ‌
– కొత్త మైనింగ్ పాల‌సీ ద్వారా వేలమందికి జోవ‌నోపాధి
– అసెంబ్లీ స‌మావేశంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా లోని అతిపెద్ద మధ్యతరహా ప్రాజెక్టుగా ప్ర‌సిద్దం చెందిన కోట్ ప‌ల్లి ప్రాజెక్టుకు రాజ‌యోగం క‌ల్పించాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆగిపోయిన మైనింగ్ లీజుల‌పై కొత్త మైనింగ్ పాల‌సీకి ఆమోదం తెల‌పాల‌ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ స‌మావేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలోని కోట్‌ప‌ల్లిలో 1975 సంవత్సరంలో సాగునీటి మ‌ద్య త‌ర‌హా ప్రాజెక్టును నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. అప్ప‌టి నుంచి ప్రాజెక్టు కింద 9 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తూ వ్య‌వ‌సాయ భూముల‌ను సస్యశ్యామలం చేసిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా రెండు ద‌శాబ్దాల నుంచి ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌త్తులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో కోట్పల్లి ప్రాజెక్టు నేడు వెలవెలబోతుందన్నారు. ప్ర‌స్తుతం 2, 3 వేల ఎకరాలకు సాగునీరు అందించలేని దుర్భర స్థితిలో ఉందన్నారు. పూడిక పేరుకపోవడంతో పాటు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మిషన్ కాకతీయ , జైకా నిధుల ద్వారా ఇతర కొన్ని ప్రాజెక్టులు మరమ్మతులకు నోచుకొన్నప్పటికీ కోట్పల్లి ప్రాజెక్టు మాత్రం ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. కోట్‌ప‌ల్లి ప్రాజెక్టుకు రాజ‌యోగం క‌ల్పించేందుకు రూ. 150 కోట్ల‌తో ప్ర‌తిపాధ‌న‌లు సిద్ద‌డం చేయ‌డం జ‌రిగింద‌ని, ఇందుకు ప్ర‌భుత్వం ఆమోదం తెల‌పాల‌ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శాస‌న స‌భ‌లో స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డిని కోరారు. దీనివల్ల తాండూర్ వికారాబాద్ లోని మూడు మండలాలకు సాగునీరు అందుతుందని స్ప‌ష్టంగా పేర్కొన్నారు. మ‌రోవైపు తాండూరు నియోజకర్గంలో మైనింగ్ లీజులు రెనివల్ తో పాటు కొత్త లీజులకు అనుమతి ఇవ్వాల‌ని కోరారు. తాండూరులో వందల ఎకరాల్లో ఉన్న వనరులపై వేల మంది జీవిస్తున్నారని తెలిపారు. ప్ర‌స్తుతం లీజులు ముగియ‌డంతో జీవ‌నోపాధి భార‌మైంద‌న్నారు. వనరులపై ఆధారపడి ఉన్న ఇతర పరిశ్రమలు మూతబడుతున్నాయని అన్నారు. కావున కొత్త మైనింగ్ పాల‌సీ ద్వారా పాత వాటి తో పాటు కొత్త లీజులు ఇవ్వాలని కోరారు.