జిల్లాలో 109 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

తాండూరు వికారాబాద్

జిల్లాలో 109 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
– 1ల‌క్ష 14వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణే ల‌క్ష్యం
– ఇత‌ర ప్రాంతాల ధాన్యంపై స‌రిహ‌ద్దులో చెక్‌పోస్టులు
– వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్‌
వికారాబాద్‌, దర్శిని ప్ర‌తినిధి: జిల్లాలో వ‌రి ధాన్యం సేక‌ర‌ణ కోసం 109 కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వికారాబాద్ జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ తెలిపారు. సోమ‌వారం మ‌ద్గుల్ చిట్టెంప‌ల్లి డీపీఆర్సీన్ భ‌వ‌న్‌లో ధాన్యం కొనుగోళ్ల‌పై రైస్ మిల్ల‌ర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్‌లు, వ్య‌వ‌సాయశాఖ ఏఈఓలు, ఐకేపీ ప్ర‌తినిధులు, ధాన్యం ర‌వాణా కాంటాక్ట‌ర్ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మోతిలాల్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 109 కేంద్రాలను ప్రారంభించారు జరుగుతుందని అన్నారు. ఏఏసీ-8,డీసీఎంస్-32, పీఏసీఎస్-47, ఐకేపీ-20, ఎఫ్‌పీఓ-1 కింద కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వెల్ల‌డించారు. జిల్లాలో 59 రైస్ మిల్స్ ఉండగా 56 రా రైస్ మిల్లులు, 3 బాయిల్డ్ కం రా రైస్ మిల్లు ఉన్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఆశించిన దిగుబడి మేరకు 114000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యం విధించింద‌న్నారు. ఈ కొనుగోలు కేంద్రాల‌లో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వేసవిని దృష్టిలో పెట్టుకొని నీడ, తాగునీటికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి దాన్యం రవాణా కాకుండా జిల్లా సరిహద్దుల్లో కొడంగల్ మండల్ రావులపల్లి, తాండూర్ మండల్ కొల్లాపూర్ ల వద్ద రెండు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ ఏఈఓలను నియామకం చేయడం జరిగింది అన్నారు. 5 క్లస్టర్లకు గాను ఒక డిప్యూటీ తహసిల్దారు కూడా నియమించినట్లు చెప్పారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు గాను రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, డీఆర్డీఓ కృష్ణవ్, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, జిల్లా మార్కెట్ అధికారి సారంగపాణి, డీసీఓ ఈశ్వరయ్య, రైస్ మిల్లర్ల సంఘం బాలేష్ గుప్తా, పోలీస్, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.