రాష్ట్రపతిపై నోరుజారుతారా..!
– భగ్గుమన్న బీజేపీ నేతలు
– సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ నోరుజారడంపై తాండూరు బీజేపీ నేతలు భగ్గుమన్నారు. వ్యాఖ్యలను నిరసిస్తూ తాండూరులో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలోని రోడ్డుపై సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. పలువురు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అంటూ నోరుజారడం దురంహాకారమన్నారు. గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి హోదాను కల్పిస్తే జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి వెంటనే రాష్ట్రపతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీకి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పూజారి పాండు, యాలాల ఇంచార్జ్ రజనీకాంత్, గిరిజన మోర్చ నాయకులు భానుపవార్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.



